
రివ్యూ : అప్పట్లో ఒకడుండేవాడు
తారాగణం : నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యహోప్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను, సత్యదేవ్...
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు
సినిమాటోగ్రఫీ : నవీన్ యాదవ్
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్
కథ, స్క్రీన్, మాటలు : సాగర్ కె చంద్ర
దర్శకత్వం : సాగర్ కె చంద్ర
రిలీజ్ డేట్ : 30.12.16
వైవిధ్యమైన కథలు ఎంచుకోవడంలో నారా రోహిత్ ది స్పెషల్ టేస్ట్.. ఆ విషయం అప్పట్లో ఒకడుండేవాడు పోస్టర్స్ చూడగానే మరోసారి అర్థమైంది. తొలి సినిమా అయ్యారేతో ఆకట్టుకున్న సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ముందు పెద్దగా ఆసక్తి లేదు కానీ.. గత మూడు వారాలుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ముందుగానే కొందరికి చూపించి మౌత్ టాక్ స్ప్రెడ్ చేశారు. మౌత్ టాక్ అంటేజెన్యూన్ టాక్ అన్నట్టే. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
రైల్వేరాజు( శ్రీ విష్ణు) క్రికెటర్ కావాలని కలలు కంటుంటాడు.. అందుకోసం నిరంతరం సాధన చేస్తూ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 1992లో టాప్ స్కోరర్ గా నిలుస్తాడు.. ఇక రంజీకి సెలెక్ట్ కావడం గ్యారెంటీ అనుకుంటోన్న టైమ్ లో ఎంటర్ అవుతాడు ఇన్స్ పెక్టర్ ఇంతియాజ్ అలీ( నారా రోహిత్). ఇంతియాజ్ పేరెంట్స్ ను నక్సలైట్స్ చంపేస్తారు.. అతనికి వారిపై ఆ కోపం ఉంటుంది. ఇటు రైల్వే రాజు అక్క కూడా కాలేజ్ లో చదువుతూనే నక్స లైట్స్ లో కలిసిపోతుంది. దీంతో మీ అక్క ఆచూకీ చెప్పమని ఇంతియాజ్ రాజును టార్గెట్ చేస్తాడు.. అది కాస్తా వ్యక్తిగతంగా మారి ఇంతియాజ్ వల్ల రాజు కుటుంబాన్నే కాదు.. కెరీర్ నూ కోల్పోవాల్సి వస్తుంది. మరి ఆ టైమ్ లో రాజు ఏ నిర్ణయం తీసుకున్నాడు. అతని నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.. అసలు ఇంతియాజ్ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేది మిగతా కథ..
విశ్లేషణ :
వివరణలోకి వెళ్లేముందు రెండు విషయాలు.. ఇది రెగ్యులర్ సినిమా కాదు.. రెండు .. ఇది 1990ల నాటి నేపథ్యంలో సాగే కథ.. రెండున్నర దశాబ్ధాల క్రితం కథను చెప్పాలంటే దర్శకుడు లేదా రచయిత చాలా అధ్యయనం చేయాలి. ఆ విషయంలో రచయిత కూడా అయిన దర్శకుడు సాగర్ కె చంద్రకు.. హండ్రెడ్ మార్క్ పడతాయి..
రైల్వే రాజుగా పరిచయమైన కుర్రాడి జీవితంలో నాలుగేళ్ల కాలంలో జరిగిన సంఘటనల సమాహారమే సినిమా. ఆ నాలుగేళ్ల తర్వాత అతను మాయమైపోతాడు.. మళ్లీ ఇరవైయేళ్లకు అతనేమయ్యాడు.. అప్పట్లో ఇక్కడ ఒకడుండేవాడు రైల్వే రాజు అంటూ ఒకమ్మాయి అతన్ని వెదుకుతూ వస్తుంది.. ఇక్కడి నుంచి మళ్లీ కథ మొదలై.. 1992 ఆగస్ట్ నుంచి ప్రారంభమవుతుంది. క్రికెటర్ కావాలనే కలలతో.. ఉన్న రాజు ఆ దిశగా మంచి ప్రయత్నం చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రంజీకి సెలెక్ట్ అయ్యే ప్రయత్నంలో ఉంటాడు. ఈ లోగా ఓ ఐపియస్ ఆఫీసర్ ను అతనింట్లోనే కొందరు నక్సలైట్స్ దారుణంగా కాల్చి చంపుతారు. ఆ కేస్ కు సంబంధించి ఇన్విస్టిగేట్ చేస్తోన్న ఇన్స్ పెక్టర్ ఇంతియాజ్ అలీ.. ఆ నక్సలైట్స్ లో రాజు అక్క కూడా ఉందని తెలుసుకుని ఆమె ఆచూకి చెప్పమని అతన్ని వేధిస్తుంటాడు.. ఈ క్రమంలో సినిమా ఎత్తుగడ కొంత ఫ్లాట్ గా అనిపిస్తుంది. కథనం కూడా యావరేజ్ గా అనిపిస్తుంది.. ఇక ఎప్పుడైతే రాజు కుటుంబాన్ని కోల్పోయి, కెరీర్ లోనూ ఎదగడం అసాధ్యమని తెలుసుకున్న నిస్సహాయ స్థితి నుంచి ఎలాగైనా ఇంతియాజ్ పై పగ తీర్చుకోవాలనే కసికి చేరుకున్న ఇంటర్వెల్ నుంచి మనకు దర్శకుడిలోని బ్రిలియన్సీ కనిపిస్తంది..
1990ల తర్వాత హైదరాబాద్ లోనూ చాలా మార్పులు వచ్చాయి. దోపీడీదార్లు పెరిగారు. గణేష్ మండపాలతో రౌడీయిజాలు పెరిగాయి.. వాటిని రాజు లైఫ్ స్టోరీలో మిక్స్ చేస్తూ వెళ్లాడు దర్శకుడు. ఇక భారతదేశంలో అత్యంత కీలకమైన దశ ప్రధాన మంత్రి పివి నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాలకు తెరతీసిన టైమ్.. దీంతో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడితే అప్పటి వరకూ యావరేజ్ గా ఉన్న స్క్రాప్ బిజినెస్ ఊపందుకోవడం.. ఒక రాజకీయ నాయకుడి అండతో రౌడీగా మారిన రాజు.. ఆ బిజినెస్ లోకి ఎంటర్ కావడం.. తర్వాత దొంగ డాక్యుమెంట్స్ తో రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లడం.. అందుకోసం సీమకే పరిమితమైన బాంబుల సంస్కృతి హైదరాబాద్ ను తాకడం.. ఇలా.. ఒకటేమిటీ.. ఆ టైమ్ లో జరిగిన ఎన్నో హిస్టారికల్ ఇష్యూస్ ను కథలోని ప్రధాన పాత్రతో ఇంటర్ లింక్ చేస్తూ దర్శకుడు అద్భుతమైన నెరెషన్ తో కథనం సాగించాడు. ఈ క్రమంలో రాజు, ఇంతియాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు.. ఓ మాస్ కమర్షియల్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా మెయిన్టే చేయడంలోనూ సక్సెస్ అయ్యాడు.. తన జీవితాన్ని నాశనం చేసిన ఇంతియాజ్ ను సస్పెండ్ చేయించిన సీన్ నుంచి అతనికి వార్నింగ్ ఇచ్చేంత వరకూ భలే అనిపిస్తుంది.. అప్పుడప్పుడూ రోహిత్ విలన్ గా కనిపిస్తాడు కానీ.. ఆ టైమ్(అప్పుడే కాదు ఇప్పటికీ) లో పోలీస్ లు అలాగే ఉన్నారనేది సత్యం. అంటే అతను పాత్రగా ప్రవర్తించాడన్నమాట. ఇక మళ్లీ ఖాకీ వేసుకున్న రోహిత్ అప్పర్ హ్యాండ్ కు రావడం అన్నీ చాలా కన్విన్సింగ్ గా.. కంఫర్ట్ గా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు..
ఆర్టిస్టుల పరంగా శ్రీ విష్ణు ఎక్కువ మార్కులు కొట్టేస్తే, రోహిత్ తనకు అలవాటైన పాత్రలో అలవోకగా వెళ్లిపోయాడు. బ్రహ్మాజీకి మరోసారి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్ ఇంప్రెసివ్ గా ఉంది.. ప్రభాస్ శ్రీను, జీవా, శ్రీనివాసరెడ్డి, సత్యదేవ్ ఇలా అందరూ తమ పాత్రలను తెరపై ఆవిష్కరించడంలో పూర్తి సక్సెస్ అయ్యారు.
ఇలాంటి పీరియాడిక్ ఫిల్మ్ కు ప్రధానంగా సహాయపడేది కెమెరామెన్.. ఆర్ట్ వర్క్, సెట్ ప్రాపర్టీస్.. ఈ విషయంలో అందరూ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. అందుకే సినిమా 1992లో ప్రారంభం కాగానే మనమూ అక్కడి నుంచే కథలో ఇన్వాల్వ్ అవుతాం.. ఇక క్రికెట్ లో రివర్స్ స్పీప్ నూ, పైరసీ క్యాసెట్స్ విధానాలను చెప్పిన విధానం నవ్వించినా.. ఇలాంటి వాటికి బీజం పడింది కూడా 90ల్లోనే చెప్పడం బావుంది.. ఇక 1993లో విడుదలైన జెంటిల్మన్ పాటను 92లో చూపించడం.. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ టేకాఫ్ కు చాలా టైమ్ తీసుకోవడం.. రెండు పార్టుల్లోనూ వచ్చే పాటలు మినహాయిస్తే.. అప్పట్లో ఒకడుండేవాడు.. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనే చెప్పాలి..
ప్లస్ పాయింట్స్
కథ, కథనం
దర్శకత్వం
ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
నేపథ్య సంగీతం
మాటలు
ఆర్ట్ వర్క్, సెట్ ప్రాపర్టీస్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
పాటలు
స్లో నెరేషన్
మొత్తంగా : అప్పట్లో ఒకడుండేవాడితో ఇప్పట్లో ఒక దమ్మున్న దర్శకుడు దొరికాడు
రేటింగ్ : 3.25/5